తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలని, డూప్లికేట్ ఓట్లు, ఓటర్ల తొలగింపులు, అంతర్‌రాష్ట్ర ఓటర్ల నమోదు వంటి అంశాలపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆమె కోరారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జరిగే సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్)కు జనవరి 1న రిఫరెన్స్ పాయింట్‌గా తీసుకుంటారని కవిత పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌లో గత ఏడాది జనవరి 1 తేదీని ప్రామాణికంగా తీసుకోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బోధన్ నియోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంలో 7 వేలకుపైగా ఓటర్ల పేర్లు తొలగించారని కవిత ఆరోపించారు. ఈ ఓటర్లు ఇతర ప్రాంతాలకు మారారా, మరణించారా లేదా డూప్లికేట్ ఓట్లుగా గుర్తించి తొలగించారా అనే విషయాన్ని ఈసీ వెల్లడించడం లేదని అన్నారు.

ఒక్క నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు జరిగితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఆమె కోరారు. ఒక నియోజకవర్గంలో 2 శాతం కంటే ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే, ప్రతి ఓటరికి ముందుగా నోటీసులు ఇవ్వాల్సిన నిబంధన ఉందని కవిత పేర్కొన్నారు. అయితే బోధన్‌లో అలాంటి నోటీసులు జారీ చేసినట్లు తమకు సమాచారం లేదని, ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించాలని కోరారు.


బోధన్‌లో 7 వేలకుపైగా ఓట్లు తొలగించగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించారని కవిత పేర్కొన్నారు. ఒకే రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లో ఇంత పెద్ద తేడా ఎందుకు వచ్చిందో ఈసీ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో 22,433 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని కవిత ఆరోపించారు. వీటిలో దాదాపు వెయ్యి ఓట్ల వివరాలను తమ పార్టీ గుర్తించి సేకరించినట్లు తెలిపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023 నాటికి కొడంగల్‌లో దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయని, దీనిపై కూడా సమగ్ర విచారణ జరగాలని ఆమె అన్నారు.
కర్ణాటకలోని సెడం నియోజకవర్గం, తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం రెండింటిలోనూ సుమారు 11 వేల మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయని కవిత ఆరోపించారు. ఒకే వ్యక్తికి రెండు రాష్ట్రాల్లో ఓటు ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.


కొడంగల్‌లో ఉన్నట్లు తాము చెబుతున్న డూప్లికేట్ ఓట్లు, అలాగే సెడం-కొడంగల్ మధ్య ఉన్నట్లు ఆరోపిస్తున్న అంతర్‌రాష్ట్ర ఓటర్ల సంఖ్య కలిపితే అది గణనీయమైన సంఖ్య అవుతుందని కవిత పేర్కొన్నారు. ఇలాంటి అక్రమంగా నమోదైన ఓట్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందా అనే అంశాన్ని ఎన్నికల సంఘం స్వతంత్రంగా విచారించాలని ఆమె కోరారు. రాష్ట్రాల మధ్య ఒకే వ్యక్తి పేరుతో నమోదైన ఓట్లను గుర్తించి తొలగించే సమర్థవంతమైన వ్యవస్థ ఎన్నికల సంఘం వద్ద ఉందా అనే ప్రశ్నను కవిత లేవనెత్తారు. అలాంటి వ్యవస్థ లేకపోతే భారీ వ్యయంతో చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.


దేశంలో “వన్ నేషన్, వన్ ఎలక్షన్”తో పాటు “వన్ నేషన్, వన్ ఓటు” అనే విధానం కూడా అమలులోకి రావాలని కవిత అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి దేశంలో ఎక్కడైనా ఒకే ఓటు మాత్రమే ఉండేలా ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అలాగే వలస వెళ్లే ప్రజలు, సంచార జాతులకు సంబంధించిన ఓటరు నమోదు విధానంపై కూడా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కోరారు. తాము లేవనెత్తిన అన్ని అంశాలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని, ఓటర్ల జాబితా సవరణను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కవిత విజ్ఞప్తి చేశారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *