108-ambulances-district-courts

రాష్ట్రంలోని జిల్లా కోర్టుల వద్ద అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా కోర్టుల వద్ద అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ALS) సదుపాయాలు కలిగిన ‘108’ అంబులెన్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లా కోర్టు వద్ద ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వాన్ని కోరగా, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ అంబులెన్సుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.3.93 కోట్లు వ్యయం చేయనుంది. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సదుపాయాలు కలిగిన ఈ అంబులెన్సులు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వేగంగా వైద్య సహాయం అందించనున్నాయి.

అదనంగా, సీఆర్డీఏ పరిధిలోని రాయపూడి, ఐనవోలు, ఉండవల్లి ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను విస్తరించేందుకు మరో మూడు కొత్త ‘108’ అంబులెన్సులను అందుబాటులో ఉంచేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయంతో జిల్లా కోర్టులకు వచ్చే న్యాయవాదులు, సిబ్బంది, పిటిషనర్లు, ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఏర్పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *