వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది పట్టాదారు రైతులకు దశలవారీగా పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

మొదటి విడతలో రెండెకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.2,482 కోట్లు విడుదల చేయనున్నారు. అనంతరం వారం నుంచి పది రోజుల్లోపు మిగిలిన అర్హులైన రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5 వేల మంది రైతులు హాజరుకానున్నారు.

నిజానికి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించి అక్కడి నుంచే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సభా ప్రాంగణం పూర్తిగా చిత్తడిగా మారడంతో సభను వాయిదా వేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే సభ వాయిదా పడినప్పటికీ రైతు భరోసా నిధుల విడుదలను మాత్రం యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వానాకాలం సీజన్‌లో సుమారు కోటిన్నర ఎకరాల సాగుభూమికి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం దాదాపు రూ.9 వేల కోట్లు సమకూరుస్తోంది. ఇందులో భాగంగా బహిరంగ మార్కెట్ నుంచి రూ.7 వేల కోట్ల రుణం సమీకరిస్తుండగా, మరో రూ.2 వేల కోట్లు జోడించి రైతు భరోసా చెల్లింపులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గత వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే తరహాలో దశలవారీగా చెల్లింపులు పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

వాతావరణం అనుకూలిస్తే జూలై 6 లేదా 7 తేదీల్లో జగన్నాథపురంలో రైతు భరోసా అందుకున్న లక్షలాది మంది రైతులతో భారీ ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతు వేదికల ద్వారా కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *