CM Vijay: ఒక్క పైసకే గ్రాము బంగారం.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరం అందించేందుకు తీసుకొస్తున్న ‘తై మామన్ తంగ మోదిరమ్’ పథకం టెండర్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 4.41 లక్షల బంగారు ఉంగరాల కొనుగోలుకు రూ.755.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్‌లో ప్రముఖ జువెలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ కేవలం రూ.0.01 సర్వీస్ ఛార్జ్ కోట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఒక్క పైసా కోట్ ఎలా సాధ్యమైంది?

టెండర్ నిబంధనల ప్రకారం బంగారం అసలు ధరను ప్రభుత్వం IBJA మార్కెట్ రేటు ఆధారంగా విడిగా చెల్లిస్తుంది. పోటీ కేవలం మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, హాల్‌మార్కింగ్, బీమా, రవాణా వంటి సర్వీస్ ఖర్చులపైనే జరిగింది. ఈ కేటగిరీలో జోయ్ అలుక్కాస్ కేవలం ఒక్క పైసా కోట్ చేయడంతో L1 బిడ్డర్‌గా నిలిచింది.

జోయ్ అలుక్కాస్‌కు 70%, కల్యాణ్‌కు 30%

టెండర్ నిబంధనల ప్రకారం L1 ధరకు సరఫరా చేయడానికి మిగతా సంస్థలకు కూడా అవకాశం ఇచ్చారు. అందులో కల్యాణ్ జువెల్లర్స్ మాత్రమే అదే రూ.0.01 ధరకు అంగీకరించింది. దీంతో ప్రభుత్వం 70 శాతం ఆర్డర్‌ను జోయ్ అలుక్కాస్‌కు, 30 శాతం కల్యాణ్ జువెల్లర్స్‌కు కేటాయించింది.

ప్రతిపక్షాల ప్రశ్నలు.. ప్రభుత్వ వివరణ

ఈ టెండర్‌పై ప్రతిపక్షాలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ, హాల్‌మార్కింగ్, రవాణా, బీమా వంటి ఖర్చులు ఉండగా ఒక్క పైసాకే సేవలు ఎలా అందిస్తారు? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. వ్యాపార లాభం లేకుండా ఇది సాధ్యం కాదని విమర్శిస్తున్నాయి.

అయితే టెండర్ పొందిన సంస్థలు మాత్రం ఇది ప్రజాసంక్షేమ పథకం కావడంతో సామాజిక బాధ్యతలో భాగంగా సేవలను అందిస్తున్నామని స్పష్టం చేశాయి. ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా L1 ఎంపిక పూర్తయిందని వెల్లడించింది.

ప్రస్తుతం రూ.755 కోట్ల ఈ భారీ పథకంలో ‘ఒక్క పైసా’ టెండర్ వ్యూహం వెనుక అసలు కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *