ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్‌లో కొత్త చరిత్ర నమోదైంది. డార్విన్‌లోని మార్రా క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ చేసిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తన రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న 25 ఏళ్ల తంజీద్.. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 188 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక భారీ సిక్స్ ఉన్నాయి.
నాథన్ లయన్ బౌలింగ్‌లో మిడ్‌ఆఫ్ దిశగా బంతిని కొట్టి తంజీద్ తన శతకాన్ని పూర్తి చేశాడు. అయితే సెంచరీ చేసిన కొద్దిసేపటికే లయన్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
62 పరుగుల వద్ద లైఫ్
తంజీద్ 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని ఎడ్జ్ చేశాడు. అది ఫస్ట్ స్లిప్‌లోకి వెళ్లగా.. సాధారణంగా అద్భుత క్యాచ్‌లు పట్టే స్టీవ్ స్మిత్ ఈసారి అవకాశాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత తంజీద్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెంచరీ వరకు దూసుకెళ్లాడు. తంజీద్ సెంచరీ పూర్తి చేయగానే బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి.
బంగ్లాదేశ్‌కు శుభారంభం
ఈ టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ 198 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో రోజు ఆటను 96/1తో ప్రారంభించిన తంజీద్, మొమినుల్ హక్ జోడీ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. తంజీద్ 102 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో మొమినుల్ కూడా సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించినా.. 49 పరుగుల వద్ద జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అనంతరం కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో క్రీజులోకి వచ్చి స్కోరు వేగాన్ని పెంచాడు. తంజీద్ ఔటైన తర్వాత ముష్ఫికర్ రహీమ్ అతడికి జతకలిశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
