దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఒక్కరోజు ముందు కలకలం రేగింది. ఢిల్లీ హైకోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఎర్రకోటతో పాటు పలు ప్రాంతాల్లో బాంబులు పేల్చుతామంటూ శుక్రవారం బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఖలిస్థాన్ పేరుతో ఈ బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు సమాచారం. ‘Blast Delhi High Court @2:11 PM’ అనే సబ్జెక్ట్‌తో వచ్చిన ఈమెయిల్‌లో ఢిల్లీలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ హైకోర్టు, ఎర్రకోట, జిల్లా కోర్టులతో పాటు మరో ఆరు ప్రాంతాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో జామ్‌నగర్ హౌస్, జండేవాలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) టెర్మినల్-3, ఢిల్లీ కంటోన్మెంట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కార్యాలయం ఉన్నాయి.
బెదిరింపు ఈమెయిల్స్ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే.
