హమాస్ 2023 అక్టోబర్ 7న జరిపిన దాడుల్లో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆ దాడులకు కీలక సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు హతమార్చాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu), రక్షణ మంత్రి కట్జ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
మంగళవారం రాత్రి గాజా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో అక్టోబర్ 7 దాడులకు సంబంధించి కీలక వ్యక్తిగా భావిస్తున్న మహమ్మద్ ఒడెహ్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఇటీవల ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ అగ్రనేత ఎజ్జెదిన్ అల్ హద్దాద్ మరణించగా, ఆయన స్థానంలో వారం క్రితమే ఒడెహ్ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఆయన్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కట్జ్‌లు ఎక్స్ వేదికగా ఒడెహ్ మృతిని ధ్రువీకరించారు.
అక్టోబర్ 7 మారణకాండలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అంతం చేస్తామని ఈ సందర్భంగా నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే, ఈ ఘటనపై హమాస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై భారీ దాడి చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 251 మందిని హమాస్ బంధించి గాజాకు తరలించిన విషయం తెలిసిందే.
