ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వచ్చే సీజన్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని.. లేదంటే కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండొచ్చని ఆ దేశ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ సంకేతాలు ఇచ్చారు.
రాబోయే 12 నెలల్లో ఆస్ట్రేలియా జట్టు అత్యంత బిజీగా ఉండే అంతర్జాతీయ షెడ్యూల్‌ను ఎదుర్కోనుంది. దీంతో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో వారి భాగస్వామ్యంపై ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యం జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
20 టెస్టులు.. 14 వైట్ బాల్ మ్యాచ్‌లు!
2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు ఆస్ట్రేలియా జట్టు సుమారు 20 టెస్ట్ మ్యాచ్‌లు, 14 వైట్ బాల్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఇంగ్లాండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఉన్నాయి. అదే సమయంలో టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఇంగ్లాండ్‌తో ప్రత్యేక టెస్ట్ మ్యాచ్ కూడా జరగనుంది.
దీనికి తోడు ఐపీఎల్ తర్వాత 2027 జూన్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కూడా జరగనుంది. ఇంతటి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్లతో పాటు కీలక టెస్ట్ ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం ఆస్ట్రేలియా జట్టుకు అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది.
ఏం చెప్పారంటే?
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్.. ఐపీఎల్ తమ ఆటగాళ్ల మేనేజ్‌మెంట్ ప్లాన్‌లో ఎప్పుడూ భాగంగానే ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌లో ఆడటం ఆటగాళ్లకు ప్రయోజనకరమేనని.. అయితే అంతర్జాతీయ క్రికెట్‌తో సరైన సమతుల్యత అవసరమని పేర్కొన్నారు. రాబోయే 20కి పైగా మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్, విశ్రాంతిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టెన్షన్!
ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో కీలక ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో రెగ్యులర్ టెస్ట్ ఆటగాళ్లు ఐపీఎల్ 2027కు దూరమైతే లేదా పరిమిత మ్యాచ్‌లకే అందుబాటులో ఉంటే.. ఆయా ఫ్రాంచైజీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా ప్లేయర్ రిటెన్షన్, వేలం వ్యూహాలు, జట్టు కాంబినేషన్‌పై ఇది ప్రభావం చూపొచ్చు. అయితే ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సంబంధించిన తుది నిర్ణయం వారి అంతర్జాతీయ షెడ్యూల్, వర్క్‌లోడ్, ఫిట్‌నెస్ పరిస్థితులను బట్టి తీసుకునే అవకాశం ఉంది.
