అండర్19 జట్టులో సంచలనం.. మూడు బర్త్ సర్టిఫికెట్లు, రెండేళ్ల నిషేధం

భారత అండర్-19 లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వయసుకు సంబంధించిన అధికారిక పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) గుర్తించడంతో అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో అన్ని స్థాయిల క్రికెట్ ఆడకుండా అతడిని సస్పెండ్ చేశారు.

ఆస్ట్రేలియా సిరీస్ నుంచి వెంటనే తొలగింపు

ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత U19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ యాదవ్, యూత్ టెస్టులో 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే CAB నివేదిక ఆధారంగా అతడిని ఈ నెల రాజ్‌కోట్, అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆస్ట్రేలియా అండర్-19 సిరీస్ జట్ల నుంచి వెంటనే తొలగించినట్లు BCCI వర్గాలు వెల్లడించాయి. అతడి స్థానంలో కొత్త ఆటగాడిని త్వరలో ప్రకటించనున్నారు.

మూడు బర్త్ సర్టిఫికెట్లు.. 27 నెలల తేడా

దర్యాప్తులో రోహిత్ యాదవ్‌కు సంబంధించిన పత్రాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అతడి పేరుతో 2006, 2007, 2009 సంవత్సరాలు నమోదైన మూడు వేర్వేరు జనన ధృవీకరణ పత్రాలు ఉన్నట్లు CAB గుర్తించింది. అలాగే 2014 నుంచి 2021 మధ్య ఆధార్ వివరాల్లో కూడా మార్పులు జరిగినట్లు తేలింది. ఈ పత్రాల ఆధారంగా అధికారికంగా 27 నెలల వయసు వ్యత్యాసం నమోదైంది.

65 మంది క్రికెటర్లపై CAB వేట

రోహిత్ యాదవ్ ఒక్కరే కాదు. వయసు పత్రాల్లో అక్రమాలు, డాక్యుమెంట్ లోపాల కారణంగా మొత్తం 65 మంది క్రికెటర్లను 2026–27, 2027–28 దేశీయ సీజన్లలో రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫర్ల నుంచి CAB నిషేధించింది.

U19 వరల్డ్ కప్ హీరో రవికుమార్‌కూ షాక్

2022 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4/34తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎడమచేతి పేసర్ రవికుమార్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. అతడి కేసులో 45 నెలల వయసు వ్యత్యాసం ఉన్నట్లు CAB పేర్కొంది. దీంతో 2021–22 నుంచి 2025–26 వరకు అతడు ఆడిన వయోపరిమితి, దేశీయ మ్యాచ్‌ల రికార్డులు చెల్లవని ప్రకటించింది. బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన స్పిన్ ఆల్‌రౌండర్ విశాల్ భట్టిపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *