ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1,600 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్‌ను దీర్ఘకాలిక ప్రాతిపదికన కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.

ఈ విద్యుత్ కొనుగోలు ప్రక్రియను విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 63 ప్రకారం టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ (Tariff-Based Competitive Bidding) ద్వారా చేపట్టనున్నారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్ అండ్ ఆపరేట్ (DBFOO) విధానంలో ప్రాజెక్టులను ఎంపిక చేయనున్నారు.

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించిన రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (RFQ), రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP), పవర్ సప్లై అగ్రిమెంట్ (PSA) మార్గదర్శకాల ప్రకారం టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, పట్టణీకరణ, భారీ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్, గరిష్ఠ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1,600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు రాష్ట్ర దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికలో తొలి దశగా భావిస్తున్నారు.

2035-36 నాటికి మరో 5,588 మెగావాట్లు

కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) రూపొందించిన రిసోర్స్ అడిక్వసీ ప్లాన్ ప్రకారం, 2035-36 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రానికి దాదాపు 5,588 మెగావాట్ల కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అవసరం అవుతుందని సూచించింది. ఇందులో తొలి దశగా 1,600 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నారు.

ఈ థర్మల్ విద్యుత్ ద్వారా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి తగ్గే సమయాల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించడంతో పాటు, సాయంత్రం పీక్ అవర్స్‌లో విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా తీర్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

అలాగే, వీలైనంత వరకు ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలని విద్యుత్ నియంత్రణ కమిషన్ సూచించింది. అయితే ఇతర రాష్ట్రాల ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ ద్వారా విద్యుత్ తక్కువ ధరకు లభిస్తే, ఆ ప్రతిపాదనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది.

One thought on “AP Thermal Power Procurement: విద్యుత్ కొరతకు చెక్.. 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *