ఆంధ్రప్రదేశ్‌లో పాదచారుల భద్రత, దివ్యాంగులకు సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ & యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంతో వాహనాలకే ప్రాధాన్యం ఇచ్చే రోడ్ల రూపకల్పనకు బదులుగా ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
పాలసీలోని ముఖ్యాంశాలు
రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాలు అన్నింటిలో ఈ పాలసీ అమలు.
కొత్త రోడ్లతో పాటు ఇప్పటికే ఉన్న రహదారులను కూడా ఆధునీకరించడం.
రోడ్లు, జంక్షన్లు, జీబ్రా క్రాసింగ్‌లకు శాస్త్రీయ భద్రతా ఆడిట్లు.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం.
పాదచారులకు మెరుగైన సౌకర్యాలు
కొత్త పాలసీ ప్రకారం…
కనీసం 2 మీటర్ల వెడల్పుతో నిరంతర ఫుట్‌పాత్‌లు ఏర్పాటు.
జారిపోని ఉపరితలం, వీల్‌చైర్‌కు అనువైన ర్యాంపులు.
దృష్టి లోపం ఉన్నవారికి టాక్టైల్ టైల్స్, బ్రెయిల్, ఆడియో సిగ్నల్స్.
అవసరమైన చోట లిఫ్ట్‌లతో కూడిన సౌకర్యాలు.
అక్రమ ఆక్రమణలకు చెక్
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ఎదుర్కొంటుంది. స్థానిక సంస్థలు, పోలీసులు, రెవెన్యూ శాఖలు కలిసి పాదచారుల మార్గాలను ఆక్రమణల నుంచి విముక్తం చేయనున్నారు.
టెక్నాలజీతో పర్యవేక్షణ
GIS మ్యాపింగ్, డ్రోన్ సర్వేలు, జియో-ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ.
CCTV, కమాండ్ కంట్రోల్ సెంటర్లతో రియల్ టైమ్ మానిటరింగ్.
ప్రజలు మొబైల్ యాప్ ద్వారా ఫుట్‌పాత్ ఆక్రమణలు, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై ఫిర్యాదులు చేయవచ్చు.
రీసైకిల్ పదార్థాల వినియోగం
నిర్మాణ వ్యర్థాలను శుద్ధి చేసి పేవర్ బ్లాకులు, బెంచీలు, రక్షణ బొల్లార్డులు వంటి పాదచారుల సదుపాయాల నిర్మాణంలో వినియోగించనున్నారు. రీసైకిల్ మెటీరియల్ ఉపయోగించే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు.
ప్రజల భాగస్వామ్యం
ఈ పాలసీ అమలులో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs), స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగుల సంఘాలు, విద్యాసంస్థలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. ప్రజల సూచనలు, సోషల్ ఆడిట్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈ కొత్త పాలసీతో పాదచారుల భద్రత, అందరికీ అందుబాటులో ఉండే రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
