Medico Priyanka: మృత్యువుతో పోరాడి ఓడిన రాజమండ్రి మెడికో ప్రియాంక: కిమ్స్‌లో బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూత..

 

మద్యం మత్తులో కొందరు తాగుబోతులు చేసిన దారుణానికి తీవ్రంగా గాయపడిన రాజమండ్రి మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూసింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

అసలు ఏం జరిగింది?

ఆగస్ట్ 3వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి బైక్‌పై బయటకు వచ్చింది. మెయిన్ రోడ్డుపై రద్దీగా ఉండటంతో బైక్‌ను కాసేపు నిలిపారు. అదే సమయంలో తీవ్ర మధ్యం మత్తులో ఉన్న సురవరపు దుష్యంత్ (నామవరం), ఆండ్రూ విలియం జోసెఫ్ (లాలాచెరువు) అనే ఇద్దరు వ్యక్తులు తమ కారుతో ప్రియాంక బైక్‌ను బలంగా ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట రాజమండ్రిలో వైద్యం అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా, శరీరంలో సోడియం స్థాయిలు పడిపోవడం మరియు తీవ్రమైన గాయాల వల్ల అప్నియా టెస్ట్ చేసేందుకు కూడా శరీరం సహకరించలేదు. చివరకు ఆమె బ్రెయిన్ డెడ్‌తో ప్రాణాలు కోల్పోయింది.

“ఇది ముమ్మాటికీ హత్యే.. నిందితులను వదలొద్దు”: తండ్రి ఆవేదన

ఆదివారం ఉదయం రాజమండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రియాంక తండ్రి వెంకటేష్ డీఎస్పీలతో మాట్లాడారు. తాగుబోతుల పైశాచికత్వానికి తన కుమార్తె బలయ్యిందని, ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా బలమైన సెక్షన్లు నమోదు చేయాలని కోరారు.

ఎస్పీ స్పందన – హత్య కేసుగా మార్పు:

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం:

  • నిందితులపై మొదట నమోదైన సాధారణ కేసులను సవరించి, ఉద్దేశపూర్వక దాడికి సంబంధించిన BNS 308, హత్యాయత్నం BNS 110 సెక్షన్లను చేర్చారు.
  • ప్రస్తుతం ప్రియాంక మృతిచెందడంతో ఈ కేసును హత్య (Murder) కేసుగా మార్చనున్నట్లు తెలిపారు.
  • నిందితులు ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, వారిని కస్టడీకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *