ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్-2026లో భారత యువ అథ్లెట్ మహ్మద్ అష్ఫాక్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. పురుషుల 400 మీటర్ల విభాగంలో 45.81 సెకన్లలో రేసును పూర్తి చేసి అండర్-20 జాతీయ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు ఫైనల్‌కు అర్హత సాధించాడు.
19 ఏళ్ల అష్ఫాక్ తొలుత హీట్-5లో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరాడు. ఈ సందర్భంగా బెంగళూరులో జరిగిన U20 ఫెడరేషన్ కప్‌లో తానే నెలకొల్పిన 46.05 సెకన్ల జాతీయ రికార్డును అధిగమించాడు. అనంతరం సెమీఫైనల్లో 46.00 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
ఇక భారత మరో అథ్లెట్ పీయూష్ రాజ్ హీట్-6లో 47.78 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. పురుషుల హైజంప్‌లో బసంత్ 2.14 మీటర్లు దూకి ఫైనల్‌కు చేరుకోగా, కే. అంబ్రీష్ 2.05 మీటర్లతోనే సరిపెట్టుకుని నిష్క్రమించాడు. మహిళల షాట్‌పుట్‌లో అన్షు 15.24 మీటర్ల అత్యుత్తమ త్రో నమోదు చేసినప్పటికీ ఫైనల్ అర్హతకు అవసరమైన మార్క్‌కు 21 సెం.మీ దూరంలో నిలిచి నిరాశ చెందింది.
మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో తను చౌదరి 1:00.03 నిమిషాల టైమ్‌తో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో అమిత్ కుమార్ చివరి స్థానంలో నిలిచాడు. ట్రిపుల్ జంప్‌లో ధనుష్ రాజ్, పీ. రాయ్షన్ కూడా ఫైనల్‌కు చేరలేకపోయారు. అయితే మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో అమనత్ కంబోజ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (53.24 మీటర్లు) నమోదు చేసి ఆరో స్థానంలో నిలిచింది.
