టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 15 ఏళ్ల 71 రోజుల వయసున్న ఈ యువ సంచలన ఆటగాడు భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకుని, దశాబ్దాలుగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎంపిక చేసింది. ముంబైలో జరిగిన సెలెక్షన్ కమిటీ సమావేశంలో అతని అసాధారణ ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు టీమిండియాకు ఎంపికైన అతి పిన్న వయస్కుడి రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత జట్టుకు ఎంపికయ్యాడు. 1980ల చివరి నుంచి కొనసాగుతున్న ఆ రికార్డును ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. దీంతో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అతి పిన్న వయస్కుడిగా నిలవనున్నాడు.

తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ ఇప్పటికే ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌లో భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతడు టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 776 పరుగులు చేసిన వైభవ్ తన పవర్ హిట్టింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. పలువురు దిగ్గజ క్రికెటర్లు సైతం అతని ప్రతిభను కొనియాడారు.

అదే సీజన్‌లో 237 స్ట్రైక్ రేట్‌తో 72 సిక్సర్లు బాదిన వైభవ్, క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించాడు. అతని దూకుడు బ్యాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని నిలకడైన ప్రదర్శన, విధ్వంసకర బ్యాటింగ్ అతడిని భారత క్రికెట్ భవిష్యత్తు తారగా నిలబెట్టాయి.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *