71 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నుంచి పద్మవిభూషణ్ వరకు అద్భుత ప్రయాణం

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి. ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందుకే సినీ అభిమానులు తరచూ చెప్పే మాట ఒక్కటే – “చిరంజీవికి ముందు… చిరంజీవి తర్వాత.” ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన కష్టం, క్రమశిక్షణ, నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్‌తో తెలుగు కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ రోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన ఇప్పటికీ అదే ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మొగల్తూరు నుంచి మెగాస్టార్ వరకు

1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన శివశంకర వరప్రసాద్‌కు చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ. ఆ కలను నిజం చేసుకోవడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ‘ప్రాణం ఖరీదు’తో సినీ ప్రయాణం ప్రారంభమైనా, మొదట విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించి తన ప్రతిభను నిరూపించుకున్నారు.

‘ఖైదీ’తో మారిపోయిన చరిత్ర

1983లో విడుదలైన ‘ఖైదీ’ కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు… తెలుగు సినిమా దిశను మార్చిన మైలురాయి. ఆ ఒక్క సినిమాతో చిరంజీవి స్టార్ నుంచి సూపర్ స్టార్‌గా, అక్కడి నుంచి మెగాస్టార్‌గా ఎదిగారు. తర్వాత వచ్చిన ‘ఛాలెంజ్’, ‘పసివాడి ప్రాణం’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వంటి చిత్రాలు ఆయనను తిరుగులేని నంబర్ వన్ హీరోగా నిలబెట్టాయి.

డ్యాన్స్‌కు కొత్త ట్రెండ్… ప్రపంచ గుర్తింపు

తెలుగు సినిమాల్లో బ్రేక్ డ్యాన్స్‌కు పాపులారిటీ తీసుకొచ్చిన హీరో అంటే చిరంజీవే. మైఖేల్ జాక్సన్ ప్రభావాన్ని తనదైన స్టైల్‌లో మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు. అదే కారణంగా ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి “Most Prolific Actor-Dancer” గుర్తింపు లభించింది. 2024లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించడం ఆయన సినీ, సామాజిక సేవలకు లభించిన అత్యున్నత గౌరవాల్లో ఒకటి.

రీల్ హీరో మాత్రమే కాదు… రియల్ హీరో కూడా

సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటుచేసి లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచారు. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం CCC ఏర్పాటు చేసి పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనేక మంది కళాకారులకు అండగా నిలిచిన సందర్భాలు ఇప్పటికీ అభిమానులు గుర్తుచేసుకుంటారు.

71 ఏళ్లలోనూ తగ్గని జోరు

రాజకీయాల తర్వాత ‘ఖైదీ నెం.150’తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ఇప్పుడు కూడా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకులను అలరించగా, ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’, బాబీ కొల్లి దర్శకత్వంలో ‘మెగా 158’ చిత్రాలతో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇదే సందర్భంగా ఆయన క్లాసిక్ హిట్ ‘ముఠా మేస్త్రి’ 4K రీ-రిలీజ్ కూడా అభిమానులకు మరో పండుగలా మారింది.

71 ఏళ్ల వయసులోనూ స్టార్‌డమ్‌కు కొత్త ప్రమాణం సృష్టిస్తున్న చిరంజీవి… ఒక పేరు కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం.

By Mamatha

One thought on “Chiranjeevi Birthday: ‘ఖైదీ’ నుంచి పద్మవిభూషణ్ వరకు… మెగాస్టార్ చిరంజీవి అద్భుత ప్రయాణం ఇదే!”
  1. […] మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158 చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. టైటిల్ రివీల్‌లో కనిపించిన వింటేజ్ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *