తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. లిక్కర్ తయారీ సంస్థల ఒత్తిడి, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో మద్యం ధరలను భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ధరల పెంపుకు సంబంధించిన ప్రతిపాదనల ఫైల్‌ను రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరగడంతో మద్యం ధరలను కూడా సవరించాలని లిక్కర్ తయారీ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ధరల పెంపుపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మూడు రోజులుగా ఈ కమిటీ మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించింది. శుక్రవారంతో ఈ చర్చలు ముగిశాయి. సమావేశాల్లో మద్యం ధరలను 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచాలని కంపెనీలు కమిటీ సభ్యులను కోరినట్లు సమాచారం.

కంపెనీల ప్రతిపాదనల ప్రకారం సాధారణ ఫుల్‌ బాటిల్‌ ధరపై గరిష్ఠంగా రూ.80 వరకు పెరుగుదల ఉండొచ్చని తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్ల ధరలు రూ.90 వరకు పెరిగే అవకాశం ఉండగా, హై-ఎండ్‌ లేదా అత్యంత ఖరీదైన బ్రాండ్లపై రూ.120కుపైగా పెంపు ఉండొచ్చని సమాచారం. త్రిసభ్య కమిటీ తన తుది నిర్ణయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చించిన అనంతరం ధరల పెంపు ఫైల్‌ను రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపనుంది. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈ నెల 15వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

గతేడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను పెంచిన నేపథ్యంలో ఈసారి బీర్ల ధరల్లో ఎలాంటి పెంపు ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్‌ షాపులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మద్యం ధరల పెంపు అమల్లోకి వస్తే ప్రతి నెలా ప్రభుత్వానికి అదనంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వార్షికంగా ఈ అదనపు ఆదాయం రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *