ఉత్తరాఖండ్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురుగ్రామ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి, ముస్సోరీలోని ఒక హోమ్‌స్టేలో విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆమె ఎలా చనిపోయారు? మృతి వెనుక ఏమైనా మిస్టరీ దాగి ఉందా? అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
27 ఏళ్ల రాధా గాయత్రి, ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేశ్కు వచ్చారు. జూన్ 14 అర్ధరాత్రి ముస్సోరీలోని టిప్రిధార్లోని కియానా హోమ్‌స్టేకు చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ రాత్రి ఇద్దరూ మద్యం సేవించి, తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రపోయారు.
ఉదయం చూసేసరికి గాయత్రి స్పృహ కోల్పోయి నేలపై పడి ఉండటంతో పాటు, ఆమె ముక్కు నుంచి రక్తం కారడం కనిపించిందని శ్రీచరణ్ పోలీసులకు వెల్లడించారు. హోమ్‌స్టే సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, గాయత్రి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
గదిలో రెండు ఖాళీ మద్యం సీసాలు లభ్యం అయ్యాయి. మృతదేహాన్ని ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని కరోనేషన్ హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టం, విసెరా నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు.
