ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన బరేలి-మథుర హైవేపై జరిగింది.
గర్హౌనా గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు తమ ఇంట్లో జరగనున్న వివాహానికి బంధువులను ఆహ్వానించేందుకు ఈ-రిక్షాలో బయల్దేరారు. ప్రయాణం మధ్యలో హైవేపై వెళ్తుండగా, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ఈ-రిక్షా డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక ట్రాక్టర్‌ను దాటిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న మరో ట్రాక్టర్‌ను గమనించలేకపోయాడు. దీంతో ఈ-రిక్షా నేరుగా ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ-రిక్షా పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మరణించగా, డ్రైవర్ షాని సహా మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విషాదకర విషయం ఏమిటంటే.. మృతుల కుటుంబంలో ఈ నెల 29న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్ల సందడిలో ఉన్న కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై యోగి అధిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
