నీట్ (NEET) 2026 పునఃపరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల లీకేజీలు, తప్పుడు ప్రచారాలు, ఫేక్ సందేశాల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్(Telegram)పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది శాశ్వత నిషేధం కాదని, పరీక్షల భద్రత కోసమే పరిమిత కాలానికి అమలు చేస్తున్న చర్యగా పేర్కొంటున్నారు.
లీకేజీ వివాదంతో రద్దైన పరీక్ష
ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో పోలికలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసినట్లు సమాచారం.
ఈ వివాదం కారణంగా పరీక్ష విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవడంతో, కేంద్ర ప్రభుత్వం మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంయుక్తంగా మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసి, జూన్ 21న దేశవ్యాప్తంగా పునఃపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టెలిగ్రామ్ ఎడిటింగ్ ఫీచర్ దుర్వినియోగం
గత పరీక్ష సందర్భంగా కొందరు వ్యక్తులు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసినట్లు ఎన్‌టీఏ గుర్తించినట్లు సమాచారం. పాత సందేశాలను సవరించి, అసలు టైమ్‌స్టాంప్ అలాగే ఉంచడం ద్వారా ప్రశ్నాపత్రం ముందే లీక్ అయినట్లు తప్పుడు ప్రచారం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫేక్ సమాచారం, తప్పుడు ఆధారాలు, నకిలీ గ్రూపుల ద్వారా జరిగే మోసాలను అడ్డుకునేందుకు టెలిగ్రామ్‌లోని కొన్ని ఫీచర్లపై తాత్కాలిక పరిమితులు విధించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
విద్యార్థులకు సూచన
నీట్ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సోషల్ మీడియాలో వస్తున్న అనధికారిక సమాచారాన్ని నమ్మకుండా, అధికారిక ప్రకటనల కోసం ఎన్‌టీఏ విడుదల చేసే నోటిఫికేషన్లను మాత్రమే అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.
