జైపుర్(Jaipur)లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijit Deepke)పై దాడి ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన చేపడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, జైపుర్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అభిజీత్ దీప్కే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు అతడి వాహనం వద్దకు చేరుకుని, చెంపపై కొట్టడంతో పాటు దాడి చేయడానికి ప్రయత్నించారు.
అయితే వెంటనే స్పందించిన సీజేపీ కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, అభిజీత్ దీప్కే ఈ ఘటనపై స్పందిస్తూ యువత ఆవేశానికి లోనుకావద్దని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
