థాయ్‌లాండ్‌లోని నోంతబురి (Nonthaburi) ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, డెబ్సిరిన్ నోంతబురి స్కూల్లో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి అదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి. ఘటన అనంతరం అతడు స్కూల్ భవనం మూడో అంతస్తులో మృతిచెందినట్లు గుర్తించారు.

ఈ ఘటన ఉదయం సుమారు 10 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.కాల్పులు ప్రారంభమైన వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఒక 18 ఏళ్ల విద్యార్థి మాట్లాడుతూ.. మొదట వినిపించిన శబ్దాలు తుపాకీ కాల్పులవని అనుకోలేదని, బాణాసంచా పేలినట్లు భావించానని తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని అర్థమైందని చెప్పాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలు, నిందితుడి ఉద్దేశం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *