ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మహా సంపన్న దేశంగా వెలుగొందుతున్న అగ్రరాజ్యం అమెరికా రుణ భారంలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ఆధారంగా ‘విజువల్ క్యాపిటలిస్ట్’ సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచ దేశాల ప్రభుత్వ అప్పుల వివరాలు వెల్లడయ్యాయి.
ఈ నివేదిక ప్రకారం అత్యధిక అప్పులు ఉన్న దేశాల జాబితాలో అమెరికా రూ. 40,739 బిలియన్ డాలర్ల భారీ రుణంతో అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానంలో చైనా 22,290 బిలియన్ డాలర్ల అప్పుతో రెండో స్థానంలో ఉంది. జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలవగా, ఇటలీ ఆరో స్థానంలో, జర్మనీ ఏడో స్థానంలో ఉన్నాయి. ఈ రుణ భారం జాబితాలో భారతదేశం 3,464 బిలియన్ డాలర్ల అప్పుతో ఎనిమిదో స్థానంలో నిలవగా, కెనడా తొమ్మిదో స్థానంలో, బ్రెజిల్ పదో స్థానంలో ఉన్నాయి.
అయితే కేవలం అప్పుల మొత్తాన్నే కాకుండా, ఆయా దేశాల స్థూల జాతీయోత్పత్తి (GDP)తో పోల్చి చూసినప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సొంత జీడీపీ కంటే ఎక్కువ అప్పులు ఉన్న దేశాల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ ప్రభుత్వ అప్పు ఆ దేశ జీడీపీలో ఏకంగా 204 శాతానికి పైగా నమోదైంది. ఆ తర్వాత సింగపూర్, సూడాన్, బహ్రెయిన్, ఇటలీ, గ్రీస్, మాల్దీవులు కూడా తమ జీడీపీని మించి అప్పులు చేసిన దేశాల వరుసలో ఉన్నాయి. ఇక అమెరికా విషయానికొస్తే, దాని అప్పు ఆ దేశ జీడీపీలో సుమారు 125 శాతానికి పైగా ఉంది.
అమెరికన్ డాలర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్, యూఎస్ ట్రెజరీ బాండ్లలో సురక్షిత పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయంగా ఉన్న ఆసక్తి వల్ల అమెరికా ఈ స్థాయిలో అప్పులు చేయగలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జీడీపీని మించి నిరంతరం పెరుగుతున్న ఈ రుణ భారం భవిష్యత్తులో దేశాల ఆర్థిక ప్రణాళికలు మరియు వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
