ఆస్ట్రేలియాలో H5N1 బర్డ్ ఫ్లూ కేసులు 200 దాటాయి. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 203 కేసులు నమోదైనట్లు ఆస్ట్రేలియా వ్యవసాయం, మత్స్య, అటవీ శాఖ (DAFF) వెల్లడించింది. జూలై చివరి నాటికి 52గా ఉన్న కేసులు.. ఆగస్టులో ఇప్పటివరకు ఏకంగా 290 శాతం పెరిగాయి. దేశంలో అత్యధిక కేసులు సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో నమోదయ్యాయి.
అక్కడ ఇప్పటివరకు 147 కేసులు గుర్తించగా.. శనివారం ఒక్కరోజే 28 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. విక్టోరియా రాష్ట్రం 43 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఇందులో 36 పక్షులను ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో సౌత్ ఆస్ట్రేలియా సరిహద్దు సమీపంలో గుర్తించారు.
పౌల్ట్రీ ఫారాలకు కొత్త నిబంధనలు
H5N1 వైరస్ పౌల్ట్రీకి వ్యాప్తి చెందకుండా విక్టోరియా ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. మెల్‌బోర్న్ సహా రాష్ట్ర దక్షిణ తీర ప్రాంతాల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పక్షులను పెంచుతున్న పౌల్ట్రీ ఉత్పత్తిదారులు వాటిని కనీసం 14 రోజుల పాటు ఇండోర్‌లో ఉంచాలని ఆదేశించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు విక్టోరియా వ్యవసాయ మంత్రి మైకేలా సెటిల్ తెలిపారు.
అయితే ఆస్ట్రేలియా వ్యవసాయ వ్యవస్థలో H5N1 వైరస్ వ్యాప్తి చెందినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం మానవ ఆరోగ్యానికి ముప్పు తక్కువగానే ఉందని ఆస్ట్రేలియా చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ బెత్ కుక్‌సన్ వెల్లడించారు.
భారీగా పక్షుల మృతిపై ఆందోళన
ఆస్ట్రేలియాలో H5N1 కారణంగా మరిన్ని భారీ పక్షుల మరణాలు సంభవించే అవకాశం ఉందని పర్యావరణ, నీటి శాఖ మంత్రి ముర్రే వాట్ హెచ్చరించారు. సౌత్ ఆస్ట్రేలియా తీరానికి సమీపంలోని ఓ ద్వీపంలో గ్రేటర్ క్రెస్టెడ్ టెర్న్ పక్షులు భారీగా మృతి చెందడంతో.. ఆస్ట్రేలియా ఖండంలో H5N1 కారణంగా సంభవించిన తొలి భారీ మరణ ఘటనగా ప్రభుత్వం గుర్తించింది.
గతంలో 2022లో దక్షిణ అమెరికాలో H5N1 కారణంగా ఆరు నెలల్లో సుమారు 30,000 సముద్ర సింహాలు మృతి చెందినట్లు అంచనా. అలాగే 2025 ఆగస్టు నుంచి 2026 జనవరి మధ్య ఆస్ట్రేలియాకు చెందిన హర్డ్ ఐలాండ్‌లో సుమారు 13,359 సదర్న్ ఎలిఫెంట్ సీల్ పిల్లలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
