గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ మరో ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘బ్లూఫ్లై (Bluefly)’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆస్కార్ అవార్డు విజేత రస్సెల్ క్రోతో కలిసి నటించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “Onto the next” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ చిత్రానికి ‘ప్రెడేటర్స్’ దర్శకుడు నిమ్రోడ్ ఆంటల్ దర్శకత్వం వహించనుండగా, డేవిడ్ ఫ్రిగేరియో, విలియం యూబ్యాంక్, కార్లైల్ యూబ్యాంక్ కలిసి కథను రూపొందించారు.
కథ ఏమిటంటే?
కాంగో అడవుల్లో కూలిపోయిన, ప్రపంచానికి తెలియకూడని ఓ రహస్య విమానాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభమవుతుంది. ఈ మిషన్‌లో దుఃఖంలో ఉన్న ఓ ఐక్యరాజ్యసమితి (UN) అనువాదకురాలు పాల్గొంటుంది. మిలీషియా ఆధీనంలోని ప్రాంతాల గుండా ప్రత్యేక బృందం ప్రయాణిస్తుండగా, ఇది సాధారణ రికవరీ ఆపరేషన్ కాదని, ఆ విమానాన్ని అసలు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశమే ఎవరికీ లేదని వారికి క్రమంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సాగే యాక్షన్, సస్పెన్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయనుంది.
రస్సెల్ క్రోతో తొలి సినిమా
ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోతో కలిసి నటించడం ఇదే తొలిసారి. రస్సెల్ క్రో ‘గ్లాడియేటర్’, ‘ఎ బ్యూటిఫుల్ మైండ్’, ‘ఎల్.ఏ. కాన్ఫిడెన్షియల్’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్నారు.
ప్రియాంక తదుపరి భారతీయ చిత్రం
హాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమాలపైనా ప్రియాంక దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు ప్రధాన పాత్రలోని భారీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. వారణాసి నేపథ్యంలో, భూమిని ఢీకొట్టబోయే గ్రహశకలం చుట్టూ సాగే విభిన్న కాలరేఖల కథతో ఈ సినిమా రూపొందుతోంది
