తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన మరో ఆసక్తికర చిత్రం ‘పళ్లబురుసు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. ‘బలగం’ సినిమాతో గుర్తింపు పొందిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
కథ విషయానికి వస్తే.. టూత్ బ్రష్ (పళ్లబురుసు) కొనివ్వలేదనే కారణంతో ఓ వృద్ధుడు తన కొడుకుపై పోలీస్ కేసు పెట్టేందుకు వెళ్లడం కథలో కీలక మలుపుగా కనిపిస్తోంది. చిన్న విషయంగా మొదలైన ఈ ఘటన.. కుటుంబంలో ఎలాంటి భావోద్వేగ పరిణామాలకు దారితీసింది? తండ్రి-కొడుకుల మధ్య బంధం ఎలా మారింది? అనే అంశాలను హృద్యంగా చూపించబోతున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది.
పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, కోర్టు డ్రామాను కలగలిపి దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించారు. తెలంగాణ నేటివిటీతో పాటు హాస్యం, ఎమోషన్ కలిసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.