బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన హిట్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)’ కొత్త సీజన్ షూటింగ్ సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గత 25 ఏళ్లుగా ఒకే టింటెడ్ (లేత పసుపు రంగు) కళ్లజోడును ఎందుకు ధరిస్తున్నానో చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
షో సెట్స్‌లో తన కళ్లజోడు గురించి కొందరు ప్రశ్నించారని, అందులో పసుపు రంగు టింట్ కనిపిస్తోందని చెప్పారని అమితాబ్ తెలిపారు. దానికి స్పందిస్తూ.. “వయసు పెరిగిందని ఎక్కువగా కళ్లను చూసే తెలుస్తుంది. నా కళ్లలో వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా ఉండేందుకు కొద్దిగా టింట్ జోడించాను” అని చిరునవ్వుతో చెప్పారు.
అంతేకాకుండా కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ రికార్డింగ్ ఆలస్యమైనందుకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. మొదటి రోజు షూటింగ్ కావడంతో సెట్‌లో అనేక సాంకేతిక ఏర్పాట్లు, చిన్నచిన్న మార్పులు చేయాల్సి రావడంతో ఆలస్యమైందని వివరించారు. ఇటీవల తన వ్యక్తిగత బ్లాగ్‌లో కూడా అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కోసం దాదాపు 24 గంటల పాటు నిరంతరం పని చేశానని వెల్లడించారు. కాగా, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కొత్త సీజన్ ఆగస్టు 10 నుంచి ప్రసారం కానుంది.
