దేశంలో భర్తలపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన ఓ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు హత్యకు గురయ్యారు లేదా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గణాంకాలు అధికారిక ప్రభుత్వ డేటా కాకుండా మీడియా కథనాల ఆధారంగా సేకరించినవేనని సంస్థ స్పష్టం చేసింది.
నివేదిక ప్రకారం మొత్తం 322 మంది భర్తలు హత్యకు గురికాగా, 232 మంది కుటుంబ సమస్యలు, మానసిక వేధింపుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. హత్యలకు గురైన వారిలో 194 కేసులు (60.2%) అక్రమ సంబంధాల కారణంగానే జరిగినట్లు పేర్కొంది. భార్యల అక్రమ సంబంధాలకు భర్తలు అడ్డుగా మారడంతో ప్రియుడితో కలిసి హత్యలకు పాల్పడిన ఘటనలు ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
ఆత్మహత్య చేసుకున్న 232 మందిలో 104 మంది దీర్ఘకాలిక కుటుంబ కలహాలు, 57 మంది భార్య లేదా ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు, 29 మంది అక్రమ సంబంధాల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. తప్పుడు కేసులు, మానసిక వేధింపులు, పిల్లలను కలవనివ్వకపోవడం వంటి కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది.
ఈ ఏడాది చోటుచేసుకున్న అత్యంత దారుణమైన 25 కేసులను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. తల నరికి హత్య చేయడం, మృతదేహాలను ముక్కలు చేయడం, విషం ఇవ్వడం, సజీవ దహనం, ప్రమాదంగా లేదా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు వంటి ఘటనలు నమోదయ్యాయని వెల్లడించింది. కొన్ని ఆత్మహత్య కేసుల్లో బాధితులు సూసైడ్ నోట్లు, వీడియోలు కూడా వదిలి వెళ్లినట్లు పేర్కొంది.
రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 93 హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా గణనీయ సంఖ్యలో కేసులు ఉన్నాయని నివేదిక తెలిపింది. ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. భర్తల హత్యలు, పురుషులపై గృహ హింసకు సంబంధించిన ప్రత్యేక అధికారిక గణాంకాలు లేకపోవడం వల్ల సమస్య తీవ్రత పూర్తిగా బయటపడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
