ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు జూన్ 26వ తేదీన సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం మొహర్రం సెలవు జూన్ 25వ తేదీన ఉండాల్సి ఉంది. అయితే ముస్లిముల పవిత్ర పండుగ అయిన మొహర్రం జూన్ 26న నిర్వహించనున్నట్లు వక్ఫ్ బోర్డు సీఈవో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వం సెలవు తేదీని జూన్ 25 నుంచి జూన్ 26కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ మార్పు కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, విద్యార్థులు ఈ సెలవును వినియోగించుకోనున్నారు.
ఇక వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. మరోవైపు తెలంగాణలో జూన్ 15 నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. బడులు ప్రారంభమైన కొద్ది రోజులకే ఏపీ విద్యార్థులకు మొహర్రం సందర్భంగా తొలి ప్రభుత్వ సెలవు లభించనుంది.
