వైసీపీ(YCP)పై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) ఘాటుగా స్పందించారు. ‘గొడ్డలి పేరుతో వైసీపీని విమర్శించే కూటమి నేతలారా.. అవును, మాది గొడ్డలి పార్టీనే. మాది పరశురాముని గొడ్డలి. 2029 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ (YS Jagan)‌ చేతికి ఇదే గొడ్డలి ఇచ్చి కూటమి పాలనను అంతమొందిస్తారని వ్యాఖ్యానించారు.

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొడాలి నాని.. గొడ్డలి శివుడు, వినాయకుడు, దుర్గాదేవి చేతుల్లో దుష్ట సంహారానికి ఉపయోగించే ఆయుధమని పేర్కొన్నారు. అదే గొడ్డలితో జగన్‌ కూటమి నేతల అవినీతి పాలనకు ముగింపు పలుకుతారని అన్నారు. అలాగే సూపర్‌-6 హామీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

చంద్రబాబుపై అంబటి విమర్శలు


మరోవైపు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గుంటూరులో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


దిష్టిబొమ్మ దహనం చేయాలంటే ముందస్తు అనుమతి అవసరమని పోలీసులు సూచించగా, అది చంద్రబాబు దిష్టిబొమ్మ కాదని, చంద్రబాబు పాలనను ఎప్పుడో తగలబెట్టేశామని అంబటి వ్యాఖ్యానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వాన్ని ‘ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం’గా అభివర్ణించారు. సూపర్‌-6 హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబును ‘ప్రపంచ మోసగాడు’, మంత్రి నారా లోకేశ్‌ను ‘ఆల్ ఇండియా మోసగాడు’గా విమర్శించారు. అలాగే వైకాపా ప్రభుత్వ హయాంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయనపై కూడా విమర్శలు చేశారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *