ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో తీరప్రాంత పర్యాటక అభివృద్ధి(Tourism Development)కి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని బీచ్(Beach) ప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్(Beach Shacks)’ పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ (AP Excise Department) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) గుర్తించిన బీచ్ ప్రాంతాల్లో ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు కానున్నాయి. పర్యాటకులను మరింతగా ఆకర్షించడం, తీరప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.


అయితే, ఈ బీచ్ షాక్స్‌లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) లేదా విదేశీ మద్యం విక్రయాలకు అనుమతి ఉండదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. కేంద్రాల నిర్వహణ, అనుమతులు, కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ప్రభుత్వం గైడ్‌లైన్స్ రూపంలో విడుదల చేసింది.


ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బీచ్ షాక్స్ పనితీరును ఏడాది పాటు పరిశీలించనున్నారు. అనంతరం పర్యాటకుల స్పందన, నిర్వహణ సామర్థ్యం, ఆర్థిక ప్రయోజనాలు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలోని ఇతర తీరప్రాంతాలకు ఈ ప్రాజెక్టును విస్తరించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. పర్యాటక రంగానికి కొత్త ఊపునివ్వడంతో పాటు తీరప్రాంతాల అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *