టెలికాం రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న జియో(Jio) ఇప్పుడు అంతరిక్ష రంగం(Space sector)పై దృష్టి సారించింది. స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ(Akash Ambani) వెల్లడించారు. ప్రస్తుతం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, ఫ్రాన్స్‌కు చెందిన యుటెల్‌శాట్ వంటి విదేశీ సంస్థలు సేవలందిస్తున్నాయి. ఈ పోటీలో జియో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడిన ఆకాశ్ అంబానీ, ‘‘జియో భూమిపై భారతదేశాన్ని అనుసంధానించింది. ఇక ఇప్పుడు అంతరిక్షం నుంచి కనెక్టివిటీ అందించే దిశగా ముందుకెళ్తోంది. జియో నెట్‌వర్క్ చేరని మారుమూల గ్రామాలు, ద్వీపాలు, సరిహద్దు ప్రాంతాలకు శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా సేవలు అందించాలనుకుంటున్నామని తెలిపారు.


దీని కోసం జియో సొంతంగా లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. అదే సమయంలో సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి అంతర్జాతీయ సంస్థల నుంచి శాటిలైట్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకునే ప్రణాళికలు కూడా రూపొందిస్తోంది. అంతేకాకుండా, జియో తన సొంత గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ, భారతదేశంలో ప్రపంచ స్థాయి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాట్‌ఫారమ్‌కు పునాది వేస్తోంది. ఈ చర్యలతో అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడమే లక్ష్యమని ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *