మ్యాగీ నూడుల్స్(Maggi Noodles)లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను నెస్లే ఇండియా(Nestlé India) ఖండించింది. అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు అన్ని నాణ్యతా ప్రమాణాలు, ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించింది.
సోషల్ మీడియా వేదికగా ఓ యూజర్ చేసిన ఫిర్యాదును ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తమ దృష్టికి తీసుకొచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే ఇప్పటివరకు ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఎలాంటి శాంపిల్స్ అందలేదని, అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వివరాలు లభించలేదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్‌ను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించామని నెస్లే ఇండియా వెల్లడించింది. పరీక్షల్లో తమ ఉత్పత్తుల్లో ఎలాంటి పురుగులు లేవని నిర్ధారణ అయిందని తెలిపింది.
