మన దైనందిన అవసరాల్లో క్రెడిట్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల కేవలం యూపీఐ (UPI) చెల్లింపులు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే, యెస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ‘భారత్‌పే ఫ్లెక్స్’ (BharatPe Flex) పేరుతో ‘క్రెడిట్-ఆన్-యూపీఐ’ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోయినా, క్రెడిట్ కార్డు మాదిరిగానే డిజిటల్ చెల్లింపులు సులభంగా నిర్వహించుకోవచ్చు.

ఉపయోగించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు 45 రోజుల వరకు గడువు లభిస్తుంది. ఈ నిర్ణీత వ్యవధిలోపు మొత్తం బకాయిని చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే గడువు ముగిసే సమయానికి పూర్తి బిల్లు చెల్లించలేని వినియోగదారులు, ఆ బకాయిని 3 నుంచి 12 నెలల వరకు సులభ వాయిదాలుగా (EMI) మార్చుకునే అవకాశం కూడా పొందుతారు.

భారత్‌పే ఫ్లెక్స్ ద్వారా లభించే క్రెడిట్ పరిమితిని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ రీఛార్జ్‌లు, వివిధ బిల్లుల చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. ఈ సేవలను పొందాలనుకునే వారు భారత్‌పే యాప్‌లో ‘పే లేటర్’ (Pay Later) ఆప్షన్‌ను ఎంచుకుని, యెస్ బ్యాంక్ కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం మంజూరైన క్రెడిట్ పరిమితిని UPIతో అనుసంధానం చేసి, పిన్ సెట్ చేసుకుంటే సేవలను వినియోగించుకోవచ్చు. అదనంగా, ఈ యాప్ ద్వారా నిర్వహించే ప్రతి లావాదేవీపై ‘జిలియన్ కాయిన్స్’ (Zillion Coins) రూపంలో రివార్డులు లభిస్తాయి. ఈ రివార్డులను వోచర్లు కొనుగోలు చేయడానికి లేదా భవిష్యత్ బిల్లుల చెల్లింపులపై తగ్గింపుల కోసం తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *