తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తియైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమ సమయంలో ప్రజలు ఆశించిన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయనే అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది. అదే సమయంలో కేవలం తెలంగాణ ఉద్యమం చుట్టూనే కాకుండా అభివృద్ధి, పాలన, భవిష్యత్ దిశ వంటి అంశాలపై కూడా రాజకీయ చర్చ జరగాలనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇలాంటి పరిస్థితుల్లో జనసేన (Jana sena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలంగాణ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తానని ప్రకటించడంపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది.

ముఖ్యంగా జాతీయవాదం అంశాన్ని ఆయన ముందుకు తీసుకురావడం తెలంగాణ రాజకీయాల భవిష్యత్ దిశను ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. తెలంగాణ ప్రజలు ఈ కొత్త రాజకీయ కోణాన్ని ఎలా స్వీకరిస్తారన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసిన అంశాలకు, ఇకపై ప్రభావం చూపబోయే అంశాలకు స్పష్టమైన తేడా ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే గుర్తించాయి. అందుకే అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) తమ వ్యూహాలను మారుస్తుండగా, బీజేపీ(BJP) కూడా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు లభిస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో పూర్తిస్థాయి రాజకీయాలు చేయాలంటే పవన్ ముందున్న అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. గతంలో వారాహి యాత్ర (Varahi Yatra) నిర్వహించినప్పటికీ అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు ఎంత సమయం కేటాయిస్తారు? ఎలాంటి రాజకీయ కార్యాచరణ చేపడతారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పవన్ ప్రకటించినట్లుగా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడితే మరోసారి వారాహి తరహా యాత్ర చేపడతారా? లేక తెలంగాణ సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల్లోకి వెళ్తారా? లేదా కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

తెలంగాణలో జనసేన పార్టీ బలాబలాలపై చర్చ వేరే అంశమైనప్పటికీ, తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, ప్రాంతీయ భావజాలంపై ఆ పార్టీకి అవగాహన ఉందనే అభిప్రాయం ఉంది. గతంలో కూడా పలు తెలంగాణ అంశాలపై జనసేన స్పందించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల సమస్యలపై మరింతగా మాట్లాడటం ప్రారంభిస్తే పార్టీకి ఆదరణ పెరుగుతుందని స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు పవన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే పవన్ ఇటీవల చేసిన కీలక ప్రకటనలను పరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాజకీయంగా గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలన్న వ్యూహం కూడా దీనిలో భాగంగా ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో కూటమి రాజకీయాలపై పవన్ చాలా జాగ్రత్తగా స్పందించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన అన్ని పార్టీలు ఒకే విధంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ప్రతి పార్టీ తన రాజకీయ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో మిత్రపక్షాలకు కూడా తమ రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించినట్లైంది.

తెలంగాణ నవనిర్మాణ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న జనసేన నాయకులు పవన్‌తో పంచుకున్న ప్రతిపాదనలు ఏంటన్నది రాబోయే రోజుల్లో బయటపడే అవకాశముంది. వాటి ఆధారంగా భవిష్యత్‌లో సభలు, ర్యాలీలు, ప్రజా ఉద్యమాలు లేదా సమస్యలపై ధర్నాలు నిర్వహిస్తారా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ఇప్పటికే పవన్ సంకేతాలు ఇచ్చారు.

ప్రస్తుతం రాజకీయంగా ప్రముఖంగా కనిపిస్తున్న పలువురు నేతల కంటే ముందే తాను తెలంగాణ సమస్యలపై స్పందించానని కూడా ఆయన గుర్తుచేశారు. అందువల్ల భవిష్యత్‌లో ఏదైనా ప్రజా సమస్యను ఆయన ప్రధాన అజెండాగా తీసుకుంటే ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని జనసేన నాయకులు భావిస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా అతిశయోక్తి అంచనాలకు తావివ్వడం లేదు.

అధికారమే లక్ష్యమని కాకుండా ప్రజల కోసం పనిచేయడమే తమ ఉద్దేశమని ఆయన చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఎన్నికలు సమీపించే కొద్దీ జనసేన అసలు రాజకీయ వ్యూహం ఏమిటన్నది బయటపడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో పవన్ రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా చర్చ సాగుతోంది. పవన్‌కు తెలంగాణ రాజకీయాలు కొత్తవి కావని, అయితే ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో గతంతో పోలిస్తే స్పష్టమైన మార్పు చూపించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.


ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ జరిగే అవకాశముందని తెలుస్తోంది. అనంతరం మేధావులు, సామాజిక వర్గాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశముందని సమాచారం. అన్ని వర్గాల సూచనలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.మొత్తం మీద తెలంగాణలో పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలు చేయడం దాదాపు ఖాయమైంది. అలాగే బీజేపీతో కలిసి కూటమి రాజకీయాలను కొనసాగించే విషయంలో కూడా పెద్దగా సందేహాలు కనిపించడం లేదు.

అయితే పవన్ భాగస్వామిగా ఉండే ఈ రాజకీయ కూటమి ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుందన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఆ ప్రభావం కాంగ్రెస్‌పైనా, బీఆర్ఎస్‌పైనా అన్నది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ, తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో మాత్రం మార్పులకు దారితీయడం ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *