మహబూబాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వాట్సాప్ చాట్‌లు బయటపడటంతో కేసు సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా చిలకోడు గ్రామానికి చెందిన గాడే రాజేశ్వర్ రావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో భవానితో వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాజేశ్వర్ రావు ఫిర్యాదు ప్రకారం, జూలై 27న మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన సమయంలో తన భార్యను మరో వ్యక్తితో అభ్యంతరకర పరిస్థితిలో చూసినట్లు తెలిపాడు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినట్లు పేర్కొన్నాడు. అయితే, జూలై 28న తన అన్నను తీసుకురావడానికి వెళ్తుండగా, భార్య ప్రియుడు సైదులు తనను వెంబడించాడని ఆరోపించాడు. అనుమానం రావడంతో భార్య మొబైల్‌ను పరిశీలించగా, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లలో తనను హత్య చేయాలనే కుట్రకు సంబంధించిన సందేశాలు కనిపించాయని తెలిపాడు.
ఆ చాట్‌లలో “నా భర్తను యాక్సిడెంట్‌లా చంపేయ్.. లేదంటే నేనే చనిపోతా” అని భార్య ప్రియుడికి మెసేజ్ చేసినట్లు రాజేశ్వర్ రావు ఆరోపించాడు. ఇంటి బయట హత్య చేసి, అది రోడ్డు ప్రమాదంలా కనిపించేలా చేయాలని కూడా సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చాట్‌ల స్క్రీన్‌షాట్లను సేకరించిన రాజేశ్వర్ రావు ఆగస్టు 1న డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తన ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని కోరాడు. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
తర్వాత కూడా కేసులో పురోగతి కనిపించకపోవడంతో రాజేశ్వర్ రావు మరోసారి ఖమ్మం రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి విచారణ చేపడతామని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు వాట్సాప్ చాట్‌ల నిజానిజాలు, ఫిర్యాదులోని ఆరోపణలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
