ఆంధ్రప్రదేశ్లోని మహిళ నిరుద్యోగులకు శుభవార్త అందింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 352 కేజీబీవీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 299 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
- ప్రిన్సిపల్ పోస్టులు – 16
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) పోస్టులు – 98
- కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRTs) పోస్టులు – 133
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PETs) పోస్టులు – 52
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టును అనుసరించి ఇంటర్, యూజీడీపీఈడీ, బీపీఈడీ లేదా ఎంపీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ అర్హతలతో పాటు ఏపీ టెట్లో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి విషయానికి వస్తే.. 2025 జులై 1 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. గరిష్ఠ వయస్సు 45 ఏళ్లకు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 50 ఏళ్ల వరకు సడలించారు. దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 6, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ ఛార్జీల కింద ప్రతి అభ్యర్థి రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పూర్తిగా అకడమిక్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు అకడమిక్, ప్రొఫెషనల్ కోర్సుల్లో సాధించిన మార్కులకు వెయిటేజీ కేటాయించి 100 మార్కులకు మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ వేతనంగా ప్రిన్సిపల్ పోస్టులకు రూ.34,139 చెల్లించనున్నారు. పీజీటీ, సీఆర్టీఈ, పీఈటీ పోస్టులకు నెలకు రూ.26,759 వేతనం అందించనున్నారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ – మే 27, 2026
- ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ – జూన్ 5, 2026
- నియామక ఉత్తర్వుల జారీ – జూన్ 18, 2026
- విధుల్లో చేరాల్సిన తేదీ – జూన్ 20, 2026
