అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema Dist)లో సంచలనం సృష్టించిన ఆక్వా రైతు హత్య(Aqua farmer murdered) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం మురమళ్ళలో ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు(Datla Krishnam Raju) హత్య కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. 64 ఏళ్ల కృష్ణంరాజును హత్య చేసి, మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో తాజాగా కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో చెరువు వద్ద పనిచేసే కార్మికులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పనుల నిమిత్తం ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు అక్కడ పనిచేస్తున్నారని, పని విషయంలో తరచూ కృష్ణంరాజుతో వారి మధ్య వివాదాలు జరిగేవని విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
అయితే ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ఆ కార్మికుల కుటుంబాలు కూడా కనిపించకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. దీంతో వారే హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన డీఎస్పీ ప్రసాద్.. అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్య వెనుక అసలు కారణాలు బయటపడే అవకాశం ఉందన్నారు. వ్యక్తిగత కక్షలా? పని వివాదమా? లేక మరేదైనా కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
