అమెరికా(America), ఇరాన్(Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ మధ్యంతర ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు చేయనున్నారు. ఇది గ్లోబల్ పీస్‌కు ఎంతో కీలకమైన ముందడుగు. ఒప్పందంలోని కీలక అంశాలను అమెరికా అధికారులు వెల్లడించారు.
ప్రధానంగా అన్ని రంగాల్లోనూ సైనిక చర్యలు తక్షణమే నిలిపివేయబడతాయి. లెబనాన్‌తో సహా, ఎక్కడా యుద్ధ కార్యకలాపాలు ఉండవు. మరి, ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తుంది. ప్రతిగా, అమెరికా ఇరాన్ పోర్టులపై ఉన్న నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. ఒప్పందం ప్రకారం 60 పాటు హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)లో టోల్-ఫ్రీ ప్రయాణం ఉంటుంది.
ముప్పై రోజుల్లోనే యుద్ధానికి ముందున్న ట్రాఫిక్ స్థాయిలను ఇరాన్ తిరిగి తీసుకువస్తుంది. ఒప్పందం అమల్లోకి రాగానే ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను అమెరికా ఎత్తివేస్తుంది. దీంతో ఇరాన్ తన చమురును స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి ఒప్పందం కుదిరిన తర్వాత మిగిలిన ఆంక్షలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అణు కార్యక్రమంపై చర్చల కోసం 60 రోజుల గడువు ఇచ్చారు. ఇరాన్ తన అత్యంత సుసంపన్నమైన యురేనియంను తగ్గించడానికి అంగీకరించింది. ఈ డీల్ కింద ఇరాన్‌కు కనీసం 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధులు అందనున్నాయి.
