పాకిస్థాన్‌లో సెలవుల కోసం వెళ్లిన ఆస్ట్రేలియాకు చెందిన 9ఏళ్ల బాలికపై పాక్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోగా, ఆమె తండ్రి, సోదరుడు గాయపడ్డారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ విచారణ జరపాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.

ఘటన ఎలా జరిగింది?

జూన్ 10న పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో హానియా అహ్మద్ కుటుంబం అద్దె కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు సాయుధ దొంగలు వారిని అడ్డగించారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగానే దుండగులు మోటార్‌సైకిల్‌పై పారిపోయారు.

అయితే, అక్కడి పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకున్న ఒక పోలీసు అధికారి, కుటుంబం ప్రయాణిస్తున్న కారునే దుండగుల వాహనంగా భావించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హానియా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె తండ్రి అదీల్ అహ్మద్, సోదరుడు ఆఫాన్ కూడా గాయపడ్డారు.

ఆస్ట్రేలియా ప్రధాని స్పందన

ఈ ఘటనపై స్పందించిన అల్బనీస్, “ఈ పరిస్థితులను పూర్తిగా, పారదర్శకంగా విచారించాలి. కుటుంబానికి నిజాలు తెలియాలి. ఆస్ట్రేలియా సరైన దర్యాప్తు, పారదర్శకతను ఆశిస్తోందని పేర్కొన్నారు.

పోలీసులపై హత్య కేసు

ఈ ఘటనలో కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోంది.

 ఎన్‌కౌంటర్‌లో దుండగులు మృతి

కుటుంబాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ ఫయ్యాజ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసులపై విమర్శలు

ఈ ఘటనపై పాకిస్థాన్ మాజీ మంత్రి మూనిస్ ఇలాహి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరపరాధ కుటుంబాన్ని నేరస్తులుగా భావించి విచక్షణారహితంగా కాల్పులు జరపడం పోలీసుల వైఫల్యమని విమర్శించారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *