అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాల్లోని పౌర నివాసాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్‌లలోని పౌర నివాసాలపై పాకిస్థాన్ బాంబు దాడులు నిర్వహించినట్లు అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని సెర్పా జిల్లాలో ఒక ఇంటిపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మరణించగా, మరో 10 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
అదే సమయంలో పక్తికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లాపై జరిగిన మరో దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతులంతా చిన్నారులేనని స్థానికులు చెబుతున్నారు. బాధితులు నిద్రిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరగడంతో తప్పించుకునే అవకాశం లేకపోయిందని వారు పేర్కొన్నారు.
ఈ వైమానిక దాడుల్లో మొత్తం 11 మంది చిన్నారులతో పాటు ఓ మహిళ, ఓ వృద్ధుడు కూడా మరణించారు. మరో 14 మంది గాయపడగా, వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన చిన్నారుల ఫొటోలను జబిహుల్లా ముజాహిద్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అయితే ఈ ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇటీవల అఫ్గాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఒక భద్రతా కేంద్రంపై దాడి జరిగింది. ఈ దాడికి తాలిబన్ మిలిటెంట్లే కారణమని పాకిస్థాన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఈ దాడి అనంతరం అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
