పశ్చిమాఫ్రికాలోని నైజర్(Niger) దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహారా ఎడారి(Sahara Desert)
లో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు సాంకేతిక లోపంతో మార్గమధ్యంలో నిలిచిపోవడంతో, తాగునీరు అందక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర నైజర్‌లోని అగాడెజ్ (Agadez Region) ప్రాంతంలో వెలుగుచూసింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతులంతా నైజర్కు చెందిన వారే. పొరుగు దేశమైన మాలి (Mali)లో జరిగిన ఓ మతపరమైన ఉత్సవానికి హాజరై స్వదేశానికి తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది.
అల్జీరియా-మాలి సరిహద్దులకు సమీపంలోని అస్సమాక (Assamaka) పట్టణానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో వారి ట్రక్కు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఎడారిలో రోజుల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వారు సుమారు 50 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి అస్సమకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
అక్కడ ట్రక్కు పరిసర ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఎడారి ప్రాంతం కావడం, రవాణా సౌకర్యాల లేమి కారణంగా మృతదేహాలను తరలించడం సాధ్యంకాకపోవడంతో, వాటిని అక్కడే సామూహికంగా ఖననం చేశారు.
అధికారుల ప్రకారం, ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. ఇదే సమయంలో సమీప ప్రాంతంలో నిలిచిపోయిన మరో ట్రక్కును సహాయక బృందాలు గుర్తించాయి.
అందులో ఉన్న ప్రయాణికులకు వెంటనే తాగునీరు అందించి సురక్షితంగా రక్షించాయి. ఉత్తర ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే వలసదారులు, ప్రయాణికులు ఉపయోగించే ఈ మార్గం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
