ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని తేల్చిన పోలీసులు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ దంపతులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారి మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మృతురాలు డెబోస్మితా పాల్ (42) ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 3న తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఆమె ఆరో అంతస్తు ఫ్లాట్‌లో మృతదేహంగా కనిపించారు.

1400 కిలోమీటర్లు ప్రయాణించి హత్య


పోలీసుల వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌కు చెందిన రామ్‌ప్రసాద్ దాస్ (42), బనశ్రీ దాస్ (36) దంపతులు ముందస్తు పథకం ప్రకారమే ఢిల్లీకి వచ్చారు. జూన్ 2న ఢిల్లీ చేరుకున్న వారు అనుమానం రాకుండా తూర్పు ఢిల్లీలోని దల్లుపురా ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్‌లో బస చేశారు. అయితే తమ అసలు గుర్తింపును దాచేందుకు ఇతరుల ఆధార్ వివరాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడింది.

డెబోస్మితా పాల్ 2022లో భర్తతో విడిపోయిన తర్వాత ఒంటరిగా ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని నిందితులు ఆమెను కలిసే నెపంతో ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

సీసీటీవీలో చిక్కిన హంతకులు


జూన్ 3న నిందితులు తమ మైనర్ కుమారుడితో కలిసి మాస్కులు ధరించి ప్రైవేట్ క్యాబ్‌లో డెబోస్మితా ఫ్లాట్‌కు చేరుకున్నారు. స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ఇంట్లోకి ప్రవేశించిన వారు వెంట తెచ్చుకున్న ఆయుధంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం వారు దుస్తులు మార్చుకుని సుమారు 30 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. అనంతరం ఫ్లాట్‌కు బయట నుంచి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కింద వేచి ఉన్న క్యాబ్‌లో ఎక్కి పరారయ్యారు.

క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన క్లూతో కేసు ఛేదన


హత్య కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారాయి. అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాల కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు జూన్ 3న ఆ కాంప్లెక్స్‌కు వచ్చిన దాదాపు 200 మందిని గుర్తించారు. వారిలో 13 మందిని అనుమానితులుగా గుర్తించి విచారించారు.

ఈ కేసు దర్యాప్తు కోసం ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నాలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. ఇదే సమయంలో నిందితులను తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ ద్వారా కీలక సమాచారం లభించింది. క్యాబ్ బుకింగ్ వివరాల ఆధారంగా ప్రయాణికులను గుర్తించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు.


బెంగాల్‌లో అరెస్ట్


హత్య అనంతరం నిందితులు ఆనంద్ విహార్‌కు చేరుకుని అక్కడి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. జూన్ 3 సాయంత్రం సుమారు 5:40 గంటలకు పూర్వా ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరి మరుసటి రోజు బర్ధమాన్ చేరుకున్నారు.


పోలీసు బృందం జూన్ 6న బెంగాల్‌కు వెళ్లి బర్ధమాన్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది. చివరకు నిందితులు దాక్కున్న స్థలాన్ని గుర్తించి అరెస్ట్ చేసింది.

ఆస్తి వివాదమే హత్యకు కారణం


డెబోస్మితా పాల్‌కు ఆమె మాతామహుడు నుంచి వారసత్వంగా వచ్చిన విలువైన ఆస్తి పశ్చిమ బెంగాల్‌లో ఉంది. కోట్ల రూపాయల విలువైన ఈ ఆస్తిలో నిందితుల కుటుంబం అద్దెకు నివసిస్తోంది.
ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని భావించిన నిందితులు ఇంటిని ఖాళీ చేయాలని డెబోస్మితా ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతదేహాన్ని గుర్తించిన సోదరి


జూన్ 4న డెబోస్మితా పాల్ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆమె సోదరి దేవరతి పాల్ ఫ్లాట్‌కు వెళ్లారు. ఇంటికి బయట నుంచి తాళం ఉండటంతో అనుమానం వచ్చి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా, ప్రొఫెసర్ మృతదేహం కనిపించింది.
దర్యాప్తులో ఆమె తలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు, చేతి మణికట్టు వద్ద నరాలు కోసినట్లు గుర్తించారు.

ఇంట్లో చోరీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు యథాతథంగా ఉండటంతో ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *