భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం ఏదైనా ఉందంటే అది రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా? లేదా? అనేదే. వయసు, ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం రోహిత్ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తాజాగా అతడికి టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ అజింక్య రహానే నుంచి గట్టి మద్దతు లభించింది.

రోహిత్ శర్మను 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే ఎంపిక చేయనున్నట్లు స్పష్టంగా చెప్పాలని రహానే సూచించాడు. రోహిత్ వంటి సీనియర్ ఆటగాడిని ప్రతి సిరీస్‌కు ఎంపిక చేస్తారా? లేదా? అనే చర్చలో ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

రోహిత్‌కు ఒక్కసారి స్పష్టంగా చెప్పాలి

“రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్ ఆడతాడని అతడికి స్పష్టంగా చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు అద్భుతమైనవి. ప్రపంచకప్‌లో అతడి అనుభవం జట్టుకు ఎంతో అవసరం. కాబట్టి ఈ విషయంలో పదేపదే చర్చ జరగాల్సిన అవసరం లేదని రహానే పేర్కొన్నాడు. రోహిత్‌ను సిరీస్‌-సిరీస్‌కు ఎంపిక చేయడం కంటే.. అతడి ప్రపంచకప్ ప్రణాళికపై స్పష్టత ఇవ్వాలని సూచించాడు.

లయలో ఉంటే రోహిత్‌ను ఆపడం కష్టం

క్రికెట్‌లో రిథమ్ చాలా ముఖ్యమని రహానే చెప్పాడు. యువ ఆటగాడైనా, అనుభవజ్ఞుడైనా మంచి లయలో ఉంటేనే తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని వివరించాడు. రోహిత్ నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో అతడి అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని రహానే అన్నాడు.

15 వన్డేల్లో రెండు భారీ స్కోర్లు

2025 అక్టోబర్ నుంచి రోహిత్ ఆడిన చివరి 15 వన్డేలను పరిశీలిస్తే.. అతడు రెండు సార్లు 120కిపైగా పరుగులు చేశాడు. మరో నాలుగు సందర్భాల్లో 70కిపైగా పరుగులు సాధించాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలోని వన్డే సిరీస్‌లో కూడా రోహిత్ విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌కు ముందు రోహిత్ కెరీర్‌పై పలు ఊహాగానాలు వచ్చాయి. లార్డ్స్‌లో జరిగే మ్యాచ్ అతడికి చివరి అవకాశం కావచ్చని, 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలక్షన్ కమిటీ యువ ఆటగాళ్ల వైపు చూడాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ తన బ్యాటింగ్‌తో ఆ ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చాడు.

‘ఆడాలనుకుంటే ఆడాలి’..

2027 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడాలని నిర్ణయించుకుంటే.. అతడిని ఆడించాల్సిందేనని రహానే స్పష్టం చేశాడు. అతడు 2027 ప్రపంచకప్ ఆడాలనుకుంటే.. ఆడాలి. దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ మధ్య పదేపదే చర్చ జరగాల్సిన అవసరం లేదు” అని రహానే పేర్కొన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ అనుభవం టీమిండియాకు కీలకంగా మారుతుందని అతడు అభిప్రాయపడ్డాడు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *