టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ఫీల్డింగ్‌లో కోహ్లీ చూపించే దూకుడు, మైదానంలో అతడి ప్రభావం ప్రత్యేకమని అన్నారు. భారత జట్టుతో దాదాపు ఐదేళ్ల పాటు పనిచేసిన దిలీప్.. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన అనంతరం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

జియోస్టార్‌తో మాట్లాడిన దిలీప్.. విరాట్ కోహ్లీ విషయంలో ఇంటెన్సిటీకి ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. పవర్‌ప్లేలో బ్యాటర్‌గా, కవర్ లేదా షార్ట్ మిడ్ వికెట్‌లో ఫీల్డర్‌గా కోహ్లీ చూపించే వేగం, రిఫ్లెక్సులు, డైవ్స్ అద్భుతమని ప్రశంసించారు.

కెరీర్‌లో ఈ దశలోనూ డెత్ ఓవర్లలో కోహ్లీ ఒక ఎండ్ నుంచి మరో ఎండ్‌కు పరుగెత్తడం, ఫీల్డ్ విస్తరించినప్పుడు సర్కిల్ నుంచి ముందుగా బయటకు రావడం గొప్ప విషయమని దిలీప్ చెప్పారు. బంతి తన వద్దకు వచ్చినప్పుడే కాకుండా.. బంతి దూరంగా ఉన్నప్పుడు కూడా దాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని కోహ్లీ కోరుకుంటాడని తెలిపారు.

కోహ్లీ ప్రభావం అలాంటిది..

ప్రాక్టీస్ సెషన్‌లోనూ, మ్యాచ్‌లోనూ కోహ్లీ తీవ్రతలో పెద్దగా తేడా ఉండదని దిలీప్ అన్నారు. కోహ్లీతో కలిసి ఫీల్డింగ్ చేసే మరో ఐదుగురు ఆటగాళ్లు కూడా తమ పరిమితులను దాటేందుకు ప్రయత్నిస్తారు. జట్టుపై అతడి ప్రభావం అలాంటిదని పేర్కొన్నారు.

బార్బడోస్ 2024.. ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం

తన కెరీర్‌లో అత్యుత్తమ క్షణం ఏదంటే.. 2024 బార్బడోస్ టీ20 ప్రపంచకప్ విజయమేనని దిలీప్ గుర్తుచేసుకున్నారు. ట్రోఫీ గెలవడం మాత్రమే కాకుండా.. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న నిశ్శబ్దం తనను ఎంతగానో కదిలించిందన్నారు.

ఆ నిశ్శబ్దంలో నాలుగేళ్లుగా ఆటగాళ్లు పడిన కష్టాన్ని తాను అనుభవించానని, ఆ దృశ్యం ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతుందని చెప్పారు.

ఫీల్డింగ్ మెడల్ వెనుక అసలు ఆలోచన ఇదే..

ఫీల్డింగ్ మెడల్‌ను ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం కేవలం అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన వారిని గుర్తించడం కాదని దిలీప్ వివరించారు. మైదానంలో ప్రతి ఆటగాడి మొత్తం సహకారాన్ని గుర్తించడమే లక్ష్యమని చెప్పారు.

హాట్‌స్పాట్‌లో ఫీల్డింగ్ చేయని ఆటగాడు కూడా చిన్న సహకారం అందిస్తే అవార్డు పొందవచ్చనే భావన కలగడంతో జట్టులో సానుకూల పోటీ మొదలైందన్నారు. ఒక ఆటగాడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తే మిగతా ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకునేవారని తెలిపారు. చివరకు ఫీల్డింగ్ మెడల్ వ్యక్తిగత అవార్డు కాదని.. టీమ్ అవార్డుగా మారిందన్నారు.

సూర్యకుమార్ క్యాచ్.. ఆ క్షణంలో ఏం జరిగింది?

2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయంలో కీలకంగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌ను కూడా దిలీప్ గుర్తుచేసుకున్నారు. చివరి ఓవర్‌లో సూర్య క్యాచ్ పట్టిన వెంటనే తాను కొన్ని సెకన్ల పాటు శారీరకంగా ప్రశాంతంగానే ఉన్నానని చెప్పారు. అయితే తన మనసులో మాత్రం అనేక లెక్కలు నడిచాయని తెలిపారు.

సూర్య క్యాచ్‌ను సరిగ్గా పట్టాడా? అతడి కాళ్లు బౌండరీ లైన్ లోపలే ఉన్నాయా? బంతిని సరైన సమయంలో పైకి విసిరాడా? అనే విషయాలను పరిశీలిస్తున్నానని చెప్పారు. క్యాచ్ క్లీన్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఒక్కసారిగా భావోద్వేగాలు ఉప్పొంగాయని దిలీప్ అన్నారు. అయితే మ్యాచ్ ఇంకా పూర్తికాలేదనే విషయం కూడా తనకు గుర్తుందని తెలిపారు. మ్యాచ్ పరిస్థితుల్లో సూర్య పట్టిన క్యాచ్ అసాధారణమైనదని కొనియాడారు.

స్లిప్ ఫీల్డింగ్‌పై దిలీప్ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు స్లిప్ ఫీల్డింగ్ గురించి కూడా దిలీప్ మాట్లాడారు. ఫాస్ట్ బౌలర్లకు బౌలింగ్ చేస్తున్నప్పుడు స్లిప్‌లో ఫీల్డర్ల మధ్య దూరం చాలా కీలకమని చెప్పారు. బంతి వేగంగా రావడంతో పక్కకు కదిలేందుకు ఎక్కువ సమయం ఉండదన్నారు. స్పిన్నర్ల విషయంలో వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్ మధ్య గ్యాప్‌తో పాటు బంతి ఎంత వేగంగా లేదా నెమ్మదిగా టర్న్ అవుతుందనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *