భారత రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ ద్వారా కోహ్లీ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

తన కెరీర్‌లో 561వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కోహ్లీ.. 560 మ్యాచ్‌లు ఆడిన రికీ పాంటింగ్‌ను అధిగమించి, ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆడుతున్న యాక్టివ్ క్రికెటర్లలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు.

రీఎంట్రీలో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ:

2008లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన కోహ్లీ.. సుదీర్ఘ కాలంగా టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఫిట్‌నెస్ విషయంలో యువ క్రికెటర్లకు రోల్ మోడల్‌గా నిలిచే విరాట్, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. గురువారం జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం టీ20, టెస్టుల నుంచి విరామం తీసుకున్నప్పటికీ.. వన్డేల్లో రన్ మెషిన్‌లా దూసుకుపోతూ తన సువర్ణ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *