అమెరికా-ఇరాన్(US-Iran) మధ్య కొనసాగుతున్న యుద్ధం(War) రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 17 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. తాజాగా ఇరాక్, జోర్డాన్‌లో జరిగిన ఘటనల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు ప్రకటించారు.

ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. “మన దేశం కోసం సేవ చేసిన వీరుల మరణం ఎంతో బాధాకరం. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను పొందనివ్వం. అవసరమైతే చివరి వరకు పోరాడతామని వ్యాఖ్యానించారు.

ఇరాక్‌లో డ్రోన్ పేలుడు.. సైనికుడి మృతి

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్ డ్రోన్‌కు సంబంధించిన పేలని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే క్రమంలో జరిగిన నియంత్రిత పేలుడులో ఒక అమెరికా సైనికుడు మరణించాడు. మరో సైనికుడు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

జోర్డాన్‌లో క్షిపణి దాడి.. ఇద్దరు మృతి

అంతకుముందు జోర్డాన్‌లోని అమెరికా, మిత్రదేశాల స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించగా.. మరో సైనికుడు గల్లంతయ్యాడు. అనంతరం ఘటనాస్థలంలో మానవ అవశేషాలు లభించాయని, అవి గల్లంతైన సైనికుడివేనా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరో నలుగురు సైనికులు గాయపడగా.. వారికి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు అమెరికా వెల్లడించింది.

17కు చేరిన అమెరికా సైనికుల మృతుల సంఖ్య

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 17 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కువైట్‌లోని షువైబా పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. అనంతరం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో గాయపడిన మరో సైనికుడు చికిత్స పొందుతూ మరణించాడు.


మార్చిలో ఇరాక్‌లో అమెరికా KC-135 ట్యాంకర్ విమానం కూలిపోవడంతో మరో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఇరాన్ అనుకూల మిలీషియా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. దీనిపై అమెరికా అధికారికంగా ధృవీకరించలేదు. జూలైలో అరేబియా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో మరో పైలట్ మృతి చెందాడు. తాజాగా ఇరాక్, జోర్డాన్ ఘటనల్లో మరో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది.

ఇరాన్‌పై అమెరికా దాడులు మరింత తీవ్రం

అమెరికా తాజాగా ఇరాన్‌లోని పలు కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించింది. గల్ఫ్ ప్రాంతంలోని పలు తీర నగరాలు, టబ్రిజ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా, దాని మిత్రదేశాల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అక్కడ ఉన్న అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.

అంతేకాకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లు పేలుడుకు గురై నిలిచిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించగా.. ఒక నౌకలో మంటలు చెలరేగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. అయితే ఈ ఘటనలకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

చర్చలకు సిద్ధమే.. కానీ దాడులు ఆగాలి

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉందని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తుండటంతో పరిస్థితికి తగినట్లుగా స్పందిస్తున్నామని చెప్పారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *