వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దిగువకు భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు వచ్చే వరద ప్రవాహం తగ్గినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు 39,608 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి
దిగువకు విడుదల చేస్తున్న నీటితో జూరాల ప్రాజెక్టులోని ఆరు విద్యుత్ యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే ఇన్‌ఫ్లో తగ్గడంతో వ్యవసాయ అవసరాల కోసం ఇకపై నీటిని విడుదల చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. జూరాల ఎడమ, కుడి కాలువల ద్వారా సుమారు 1.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం వ్యవసాయానికి నీటిని విడుదల చేస్తే.. వచ్చే సీజన్‌లో తాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జూరాల నీటి నిల్వ పరిస్థితి
జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.51 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 7.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేసినప్పటికీ.. విద్యుత్ ఉత్పత్తి మాత్రం కొనసాగుతోంది. జూరాల నుంచి దిగువకు నీటి విడుదల తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
