Recurring Headache Causes:తరచుగా తలనొప్పి వేధిస్తోందా? మీ జీవనశైలిలో మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న పొరపాట్లే కారణం కావచ్చు!

 

తలనొప్పి అనేది అందరినీ ఏదో ఒక సమయంలో వేధించే సర్వసాధారణ సమస్య. అప్పుడప్పుడు వచ్చే తేలికపాటి తలనొప్పి గురించి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. అయితే, తలనొప్పి తీవ్రంగా ఉండటం, తరచూ రావడం లేదా అసాధారణ మార్పులు కనిపించడం చేస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామందిలో నిరంతరం వచ్చే తలనొప్పులకు ప్రధాన కారణం మన రోజువారీ అలవాట్లు, ఆహారపు మార్పులేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తలనొప్పిని ప్రేరేపించే ఆ ప్రధాన జీవనశైలి పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం:

1. సమయానికి భోజనం చేయకపోవడం (Skipping Meals)

వేళకాని వేళల్లో తినడం లేదా భోజనం మానేయడం (స్కిప్ చేయడం) వల్ల రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. ఇది మైగ్రేన్ లేదా టెన్షన్ తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ నిర్ణీత సమయానికి సమతుల ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

2. డీహైడ్రేషన్ – శరీరంలో నీటిశాతం తగ్గడం

అకారణంగా తలనొప్పి వస్తుంటే మీరు సరిపడా నీళ్లు తాగుతున్నారో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. శరీరంలో ద్రవాల శాతం తగ్గినప్పుడు మెదడు కణజాలం తాత్కాలికంగా కుంచించుకుపోయి పుర్రె ఉపరితలం నుండి కాస్త వెనక్కి లాగినట్లవుతుంది. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. తిరిగి తగినన్ని నీళ్లు తాగినప్పుడు మెదడు సాధారణ స్థితికి వచ్చి నొప్పి తగ్గుతుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) పరిశోధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి.

3. నిద్రలేమి & సరిగ్గా లేని పడుకునే తీరు

రాత్రివేళ సరిపడా (7-8 గంటలు) నిద్రపోకపోవడం, సరిగ్గా లేని దిండును వాడటం వల్ల మెడ మరియు భుజాల కండరాలు ఒత్తిడికి గురవుతాయి. అంతేకాకుండా, నిద్రలో పళ్లు కొరకడం, పడుకునే ముందు గట్టి ఆహారాన్ని నమలడం కూడా తలనొప్పికి దారితీస్తాయి. రాత్రి పడుకోవడానికి గంట ముందు మొబైల్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండటం ద్వారా నాణ్యమైన నిద్రను పొంది తలనొప్పిని నివారించవచ్చు.

4. మితిమీరిన స్క్రీన్ టైమ్ (Excessive Screen Time)

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను గంటల తరబడి చూడటం వల్ల కళ్లపై భారం పడి, మెడ కండరాలు బిగుసుకుపోతాయి. ఇది ‘టెన్షన్ టైప్’ తలనొప్పిని రప్పిస్తుంది. దీనిని నివారించడానికి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూసే ’20-20-20 నియమాన్ని’ పాటించాలని కంటి వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ, తగినంత నీరు తాగుతూ ప్రశాంతమైన నిద్రపోవడం ద్వారా తలనొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *