తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, నిధుల కేటాయింపులో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ముఖ్యంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గంతో పాటు ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌ అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీకి మహారాష్ట్రను ఒప్పించండి

ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ సాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలకమని వివరించారు. దీని ద్వారా వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీటిని సరఫరా చేయవచ్చని తెలిపారు. వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలకూ ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో జరిపిన సమావేశం వివరాలను ప్రధానికి వివరించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు అవసరమైన పరిహారం చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

భూసేకరణ కారణంగా నిర్వాసితులయ్యే వారికి పరిహారం త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను కూడా వేగవంతం చేసినట్లు వివరించారు.

పెండింగ్‌ అనుమతులు త్వరగా మంజూరు చేయాలి

ఎస్‌. జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), సీతమ్మసాగర్‌ బహుళ ప్రయోజన ప్రాజెక్టు (SSMP), డిండి ఎత్తిపోతల పథకం (DLIS) కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినప్పటికీ.. పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో ఆశించిన తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని రేవంత్‌రెడ్డి ప్రధానికి వివరించారు.

పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతులతో పాటు అవసరమైన ఇతర చట్టబద్ధమైన క్లియరెన్స్‌లను ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు చేయాలని మోదీని కోరారు.

తెలంగాణకు అదనంగా రూ.5 వేల కోట్లు ఇవ్వండి

పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం (Scheme for Special Assistance to States for Capital Investment – SASI) కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 70 నుంచి 90 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు ఇప్పటికే స్థిరపడిన ఆయకట్టు ప్రాంతాలకూ సాగునీరు అందించేందుకు వీలవుతుందని వివరించారు. తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎన్వోసీ

సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ఇప్పటికే కేంద్ర జల సంఘం (CWC)కు సమర్పించినట్లు రేవంత్‌రెడ్డి ప్రధానికి తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, గ్రామాల సంఖ్యను గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఇందులో పూర్తి రిజర్వాయర్‌ స్థాయి (FRL), బ్యాక్‌వాటర్‌ స్థాయిలను కూడా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వే కోసం రూ.9.88 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి భూముల పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) త్వరగా వచ్చేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.

పీఎంకేఎస్‌వై కింద నాలుగు ప్రాజెక్టులకు నిధులు కోరిన సీఎం

ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) కింద తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాలుగు ప్రాజెక్టులకు అవసరమైన నిధుల వివరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

     

      • సమ్మక్కసాగర్‌ సమగ్ర ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు.

      • మోడికుంట వాగు ప్రాజెక్టుకు రూ.392 కోట్లు.

      • చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు.

      • చనాకా-కొరాట బ్యారేజీకి రూ.103 కోట్లు.

    ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, అనుమతులు త్వరగా మంజూరు చేయడంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో ఉన్న అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

    మరన్ని తాజా వార్తల కోసం మా వెబ్ సైట్ ని లైక్ చేయండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *