స్థానికత, స్థానిక రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్ వర్తించాలంటే నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిబంధనలు అమలు చేయాలని తేల్చిచెప్పింది.
ఈ అంశంపై గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం మరోసారి పునరుద్ఘాటించింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్‌కు సంబంధించి నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధన చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది.
నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి
స్థానిక రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ఉన్న నిబంధనను సవాల్ చేస్తూ జెల్ల అంకిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధన ఏకపక్షంగా ఉందన్న పిటిషనర్ వాదనను ధర్మాసనం తిరస్కరించింది.
ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన వారికి మాత్రమే స్థానికత వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వ నిబంధనకు సమర్థన
ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. స్థానిక రిజర్వేషన్ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించాల్సిందేనని పేర్కొంది.
దీంతో తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత నిర్ణయంలో నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధన కీలకంగా మారింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

